గుంటూరు : నా యావత్ ఆస్తిని ప్రజల కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రేపల్లె ఎమ్మెల్యే, టీడీపీ ప్రధాన కార్యదర్శి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తనకు వారసులు లేరని.. ప్రజలే తన వారసులని చెప్పారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నగరం మండలం పూడివాడి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఆసరగా ఉంటానని, ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు.
రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు మితిమీరాయని ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని తీవ్రస్వరంతో హెచ్చరించారు. టీడీపీ ఫ్లెక్సీలను చించేయడం వైసీపీ నేతల దుర్మార్గానికి పరాకాష్ట అని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. తన ఆస్తులు అమ్మి అయినా సరే ప్రజలకు సేవ చేస్తానన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి రానున్నదని సత్యప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే నష్టపోయిన టీడీపీ కార్యకర్తలందరికీ న్యాయం చేసేలా చూస్తానన్నారు. కార్యకర్తలే తన బలం, బలహీనత అని చెప్పారు. వారి కోసం ఏం చేయడానికైనా, ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పారాయన.