అమరావతి : వైసీపీ ఐదేండ్ల పాలనలో ప్రజాధనం దుర్వినియోగమయిందని ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని, వారిని విచారిస్తున్నామని పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.
తణుకులో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) లో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు తేలిందని అన్నారు. ఈ అక్రమాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికే విచారణ కమిటీ వేశాం. నివేదిక కూడా వచ్చింది. సీఎంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న లేఅవుట్(Jaganna layout) ఇళ్ల నిర్మాణంపై అనేక వినతులు వస్తున్నాయని, వీటిపై విచారణ జరిపి లబ్దిదారులకు తగిన రీతిలో న్యాయం చేస్తామని వెల్లడించారు.
ఏపీలో కూటమిది ప్రజాపాలన ప్రభుత్వమని, ప్రజలనుంచి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రజా వినతులపై సీఎం చంద్రబాబు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు. సమస్యల పరిష్కార ప్రత్యేక వేదికలో చాలా మంది వినతులతో వస్తున్నారని, తమ దృష్టికి వస్తున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు .