JC Prabhakar Reddy | బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగినవిధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు. జేసీ వ్యాపారాలపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇదిలా ఉంటే బీజేపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు కూడా ఘాటుగా స్పందించారు. మాధవీలతను ప్రాస్టిట్యూట్ అంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. జేసీ వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు. అధికార పార్టీలో ఉండి ఏం మాట్లాడుతున్నారో జేసీ ప్రభాకర్ రెడ్డి గ్రహించుకోవాలని సూచించారు. మీ వయసు పెద్దది.. అలాగే మీ ప్రవర్తన కూడా ఉండాలని జేసీకి హితవు పలికారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా జేసీ ప్రవర్తన ఉందని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. బస్సుల దహనాన్ని బీజేపీ ఎప్పటికీ ప్రోత్సహించదని చెప్పారు. జేసీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని సూచించారు.
తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో నిర్వహించిన వేడుకలకు వెళ్లవద్దని న్యూ ఇయర్‌కు ముందు బీజేపీ నేత మాధవీలత ఒక వీడియో షేర్ చేశారు. జేసీ పార్కులో నిర్వహించే ఈవెంట్లో పాల్గొనవద్దని.. అక్కడ మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. పెన్నా నది ఒడ్డున జేసీ పార్కు వద్ద గంజాయి, డ్రగ్స్ బ్యాచ్‌లు ఉంటాయని తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో మత్తులో వాళ్లు ఏమైనా చేయొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
మాధవీలత వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే మీకేంటి సమస్య అని ప్రశ్నించారు. కొత్త సంవత్సరంలో పట్టణ మహిళలకు అవమానం జరిగేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో తన బస్సుల దగ్ధం వెనుక కూడా బీజేపీ ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కేవలం తన బస్సులను సీజ్ చేయించారని.. కానీ మీరు మాత్రం బస్సులు తగలబెడుతున్నారంటూ బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని.. పోలీసులే సుమోటోగా కేసు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మాధవీలతపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.