Minister Sandhya Rani | నంద్యాల జిల్లాలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,663 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇందులో 1,620 ప్రధాన, 43 మినీ అంగన్వాడీలు ఉన్నాయి. రెండు వర్కర్స్, రెండు మినీ వర్కర్స్, రెండు వర్కర్లు, 40 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని తక్షణమే భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. బాలసంజీవని పోషణ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి ఆరేళ్ల పిల్లలకు ఉచితంగా గుడ్లు, పాలు, మల్టిగ్రేన్ పిండి తదితర పోషకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిపొందుతున్నారన్నారు.
గత ఆరో నెలల్లో పిల్లల్లో పోషక లోపాలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందిని అభినందించారు. జిల్లాలోని 101 సాక్షం అంగన్వాడీల్లో ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024లో ఏర్పడిన శిశు సంరక్షణ యూనిట్ ద్వారా ఈ ఏడాది 157 మంది పిల్లలు రక్షించారు. బాల్య వివాహాలు, పోస్కో (POCSO), బాల కార్మికత కేసుల్లో చర్యలు తీసుకున్నామని వివరించారు. సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా బాధిత మహిళలకు న్యాయ, వైద్య, కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామన్నారు. త్వరలో సొంత భవన నిర్మాణం ప్రారంభమవుతుందని.. మహిళలు, పిల్లల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతని, ఆధునిక వసతులతో అంగన్వాడీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మహిళల రక్షణకు, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. సమావేశంలో కలెక్టర్ రాజకుమారి గణియా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.