Srisailam | శ్రీశైలం : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. శ్రీశైలంలో గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం (Tribal Multipurpose Marketing Center) భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.కోటి మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రైబల్ మల్టిపర్పస్ మార్కెటింగ్ కేంద్రం గిరిజన సమాజానికి వరమని.. నిర్మాణం పూర్తయితే శ్రీశైలం, పరిసర ప్రాంతాల్లోని వారికి సామాజికంగా, ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందన్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసే వ్యవసాయ పంటలు, వనరులు, ఉత్పత్తులు, హస్తకళలు, చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను నేరుగా మార్కెట్కు చేరవేసే వేదికగా ఇది పనిచేస్తుందని చెప్పారు.
గిరిజనులు మధ్యవర్తులు లేకుండానే ఉత్పత్తులకు మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, గిరిజన యువతకు వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కేంద్రాలు మరిన్ని ప్రాంతాల్లో స్థాపించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచు గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను అందిపుచ్చుకొని చెంచులు అందరు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, జయసూర్య, గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు.