నగదు బదిలీ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ పౌర సరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితమని విరుచుకుపడ్డారు. నగదు బదిలీని బలవంతంగా ఎవ్వరిపై కూడా రుద్దమని, ఎవరైతే నగదుబదిలీ కోరుకుంటారో వారికే ఇస్తామని, మిగతా వారికి యథాతథంగా బియ్యమే ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్నే తాము అమలు చేస్తున్నామని, దీనిని విమర్శిస్తే ప్రధాని మోదీని విమర్శించినట్లే అవుతుందని మంత్రి కారుమూరి తేల్చి చెప్పారు. ఇప్పటికే చండీగఢ్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలీ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇది అమలులో ఉందన్నారు. ప్రజల ఆరోగ్యరీత్యా కొందరు ముడిబియ్యం, జొన్నలు, రాగులు… ఇలా వాడుతున్నారని వివరించారు.
డయాబెటిస్ ఉన్న వారు ఈ బియ్యాన్ని వాడటం లేదని, వారు తినే వాటిని కొనుక్కోడానికే నగదు బదిలీ పథకమని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి దీనిని ఓ పైలట్ ప్రాజెక్ట్‌గానే చూడాలని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డుల విషయంలోనూ తమ ప్రభుత్వం పారదర్శకంగానే వుందని, గత ప్రభుత్వాల లాగా వ్యవహరించడం లేదన్నారు. వీటి విషయంలోనూ ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓ నెల నగదు బదిలీ కోరి, మరో నెల బియ్యమే కావాలని ఎవరైనా అడిగినా… వారు కోరుకున్న విధంగానే చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులకు కూడా కార్డులు కట్ చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని, జూన్‌ల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన ప్రకటించారు.
బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో కుట్ర కోణం : సోము
రాష్ట్రంలో బియ్యం బదులు నగదు ఇస్తామనడంలో ప్రభుత్వ కుట్ర కోణం దాగి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు విమర్శించారు. ప్రజలపై బలవంతంగా ఒత్తిడి పెంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇంటింటికి రేషన్ పథకాన్ని అటకెక్కించేందుకే ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతుందని, పోర్టుల ద్వారా బియ్యాన్ని విదేశాలకు పంపించే ప్రయత్నం చేస్తోందని ఆయన వెల్లడించారు.