తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను(Karthika Brahmotsavam) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి( Minister Anam Ramnarayana Reddy) అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టామన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో పంచమి తీర్థం రోజున దాదాపు 50 వేలకు పైగా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించామన్నారు.
ఈ నెల 20, 21 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Murmu) తిరుచానూరు, తిరుమలలో శ్రీ పద్మావతీ అమ్మవారిని, శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీజీవో గిరిధర్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, టీటీడీ ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, అధికారులు పాల్గొన్నారు.