Anagani Satya Prasad | మదనపల్లి ఫైల్స్ కేసులో విచారణ వేగంగా జరుగుతోందని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించారు. తిరుపతిలో వకుళామాత అమ్మవారిని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఆయన సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్నది ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం వందల ఎకరాల భూకబ్జాలకు పాల్పడిందని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తిరుపతి, చిత్తూరు, రాజంపేట నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో పెద్దిరెడ్డి బాధితులు ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని స్కామ్‌లను బయటపెడతామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రజా ధనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.
అనంతరం గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాకపోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయని అన్నారు. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. రైతులకు నాణ్యమైన కరెంటు అందిస్తామని స్పష్టం చేశారు.