తిరుపతి : విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం(Merger )చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు శుక్రవారం టీటీడీ ఈవో(Ttd EO) ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలు నిర్వహించనున్నారు.
ఈవో మాట్లాడుతూ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన రాజాం ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్ వరలక్ష్మి పౌండేషన్(GMR Foundation) ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని కోరిన మీదట టీటీడీ పాలకమండలి(Ttd Board) ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఆలయాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు జీఎంఆర్తోపాటు రాజాం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 ఆలయాలు ఉన్నాయని ఈవో వివరించారు.
రాజాం ఆలయ చరిత్ర..
రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీకాకుళం రోడ్డులో 3.5 ఎకరాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్ స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 2015లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి ట్రస్టు ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.