నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి విజయం సాధించారు. అంతా అనుకున్నట్లుగానే వైసీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయడంఖా మోగించారు. ఈ ఎన్నికలో గౌతమ్‌రెడ్డి 82 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ తో విజయం సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. బీఎస్పీ అభ్యర్థికి 4,897, నోటాకు 4,179 ఓట్లు వచ్చాయి. లక్ష పైచిలుకుతో విక్రమ్ గెలుస్తాడని వైసీపీ శ్రేణులు భావించినప్పటికీ మెజారిటీ 82,888 కే పరిమితమైంది.
ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్.. విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు. పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైసీపీకి 167 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికకు టీడీపీ, జనసేన దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమంటూ పోటీకి నిలపడంతో ఎన్నిక అనివార్యమయింది. మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.