Polavaram Cofferdam | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్‌కు సంబంధించిన అప్పర్ కాఫర్ డ్యామ్ భారీగా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు కొద్దిమేరనే డ్యామేజీ అయ్యిందని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలోమాత్రం భారీగానే నష్టం జరిగినట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలవరం డ్యామ్ నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన, దిగువ కాఫర్ డ్యామ్‌లను నిర్మించాల్సి ఉన్నది. ఆ తర్వాత ప్రధాన డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుంది. అందులో భాగంగా తొలుత 2.1 కిమీ పొడవు, 31 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
తర్వాత దానిని 41.5 మీటర్ల ఎత్తుకు పెంచారు. కాగా అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. తాజాగా అది పలు చోట్ల దెబ్బతిన్నది. తొలుత 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్‌డ్యామ్ బండ్ దెబ్బతిన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. కానీ అంతకంటే ఎక్కువస్థాయిలోనే నష్టం వాటిల్లినట్టు తెలుస్తున్నది. అప్పర్ కాఫర్ డ్యామేజీకి సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలను పరిశీలిస్తే అధికారులు చెప్తున్నది అవాస్తవమని స్పష్టమవుతున్నది.
అయినా అధికారులు నోరుమెదపడం లేదు. 2022లోనూ వరదలతో పలుచోట్ల కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నది. తాజాగా గతంలో దెబ్బతిన్న ప్రాంతంలోనే ప్రస్తుతం కాఫర్ డ్యామ్ దెబ్బతినడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సాంకేతిక సమస్యను భూతద్దంలో చూపుతూ హంగామా చేసిన ఎన్డీఎస్ఏ ఇప్పటికీ పోలవరం డ్యామ్ వైపు మాత్రం కన్నెత్తి చూడకపోవడం గమనార్హ ం.