Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో రెండో శ్రావణ శుక్రవారం (25-8-2023) సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రవది కల్యాణ మండపంలో ఈ వ్రతాలు ఏర్పాటు చేశారు. ఈ వ్రతాలకు కావాల్సిన పూజా ద్రవ్యాలన్నింటినీ దేవస్థానమే సమకూర్చింది. వత్ర కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ముత్తైదువకు వేర్వేరుగా కలశాలు నెలకొల్పి శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా వరలక్ష్మి వ్రతం జరిగింది. దీనికి ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు. తర్వాత వేదికపైకి వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు.
వరలక్ష్మి వ్రతంలో భాగంగా భక్తులందరితో విడివిడిగా కలశ స్థాపన చేయించి వరలక్ష్మి దేవి వారికి సమంత్రకంగా ఆవహింపజేశారు. తదుపరి శ్రీసూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా వరలక్ష్మీ దేవి వారికి షోడషోపచార పూజలు నిర్వహించారు. అటుపై ఆలయ అర్చకులు.. వ్రత కథను పఠించి వ్రత మహిమా విశేషాలను భక్తులకు తెలిపారు. నీరాజన మంత్ర పుష్పాలను జరిపి వ్రత సమాప్తి చేశారు.
వ్రతం జరిపించుకున్న ప్రతి ముత్తైదువకు అమ్మవారి శేష వస్త్రాలుగా రవిక వస్త్రం, పూలు, గాజులు, శ్రీశైల ప్రభ మాస పత్రిక, ప్రసాదం అందజేశారు. వారందరికీ శ్రీ స్వామి అమ్మవార్ల కైలాస కంకణాలు అందజేశారు. వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక క్యూ లైన్ ద్వారా స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. దర్శనానంతరం దేవస్థానం అన్నపూర్ణ భవనంలో ముత్తైదువలందరికీ అన్న ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్ లవన్న దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ లవన్న మాట్లాడుతూ మన వైదిక సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం సంప్రదాయంగా వస్తున్నదన్నారు. ఈ శ్రావణ మాసం సర్వదేవతా ప్రీతికరం అని పురాణాలు చెబుతున్నాయన్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించినట్లు తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొనడం ఎంతో హర్షణీయం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంతు నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, సహాయ ఈఓలు ఐఎన్వీ మోహన్, ఎం హరిదాసు, అర్చక స్వాములు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.