Srisailam Temple | శ్రీశైలం : ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆరుద్ర నక్షత్రం, సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ క్రమంలో క్షేత్ర వీధులన్నీ భక్తులతో కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామి అమ్మవార్లకు జరిపే నిత్య ఆర్జిత సేవలు యధాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Srisailam Temple
ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టగా శీఘ్ర, అతిశీఘ్ర, విరామ దర్శనాలకు గంట సమయం పట్టిందని పీఆర్వో శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రదోష కాలంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు వెండి రథోత్సవం నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, వెండి రథోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేశారు.
Srisailam Temple
ఆరుద్ర నక్షత్రం సందర్భంగా క్షేత్రంలో స్వర్ణరథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. సోమవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాలతో అభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు,
శుద్ధ జలాలతో స్వామివారిని అభిషేకించి మహా బిల్వార్చన, పుష్పార్చనలు చేశారు. అదేవిధంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మహా సంకల్పాన్ని పఠించారు. అనంతరం స్వర్ణరథంపై ఆశీనులైన స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు.
Srisailam Temple
ఆలయ మహాద్వారం నుంచి నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ ఉత్సవం జరిగింది. ఉత్సవంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వర్ణ రథోత్సవాన్ని ప్రతి మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావుతో పాటు ఏసీ చంద్రశేఖర్ రెడ్డి, ఈఈ నర్సింహారెడ్డి, పీఆర్వో శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Srisailam Temple
Srisailam Temple