Srisailam | శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదవరోజు సోమవారం చండీశ్వరస్వామికి షోడషోపచార క్రతువులు చేసిన అనంతరం ఈవో శ్రీనివాసరావు దంపతులు రుద్రహోమం, నిత్యహోమాల పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, మహదాశీర్వచన పూజాధికాలు జరిపించారు. ఆలయ ప్రాకారం లోని మల్లికా గుండంలో వైదిక శాస్త్రోక్త అవబృదస్నానం చేయించిన తర్వాత వసంతోత్సవాన్ని నిర్వహించారు. అవబృదంలో భాగంగా చండీశ్వరున్ని ఆలయ ప్రదక్షిణ చేసి ప్రాకారంలోని మల్లికా గుండం వద్దకు తోడ్కొనివచ్చి వేదమంత్రాలతో షోడషోపచార క్రతువులు పంచామృతాలు శుద్ధజలాలతో సహస్రధార చక్రస్నానం చేయించారు. అనంతరం స్వామివారిని తలపై ధరించి పుణ్యస్నాన కార్యక్రమం వైభవంగా జరిపించారు. మల్లికాగుండ జలాన్ని ప్రోక్షించుకోవడంతో సకల శుభాలు కలుగుతాయని స్థానాచార్యులు తెలిపారు.
శ్రీశైలంలో ఉగాది మహోత్సవ చివరిరోజు సోమవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సాయంత్రం అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను అశ్వవాహనం పై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాసరావు నేతృత్వంలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్త పూజలు జరిపించి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ అష్టభుజాలు పలు ఆయుధాలతో నిజరూపాలంకరణలో దర్శనమిచ్చిన భ్రామరి అమ్మవారిని చూసేందుకు భక్తులు ఆలయ ప్రాకారంలో బారులుదీరారు. మహోత్సవాల్లో భాగంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిండంపై కళాకారులతోపాటు ఆలయ అధికారులను సిబ్బందిని యాత్రికులు అభినందించారు.
Srisaila Temple 02