అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మల్లాది విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. మల్లాది విష్ణు ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఏపీ క్యాబినెట్ పునర్వవ్యవస్థీకరణ చేపట్టినప్పుడు మల్లాది విష్ణుకు మంత్రి పదవి వస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ ఎమ్మెల్యే అయిన మల్లాది విష్ణును జగన్ తన మంత్రివర్గంలో తీసుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ పటాపంచలయ్యాయి. తీరా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మల్లాది విష్ణుకు మంత్రిపదవి దక్కలేదు. దాంతో ఆయన కొన్నిరోజులు కినుక వహించారు. మల్లాది సేవలను మరోరకంగా వాడుకుంటామని క్యాబినెట్ పొడగింపు సమయంలో సీఎం జగన్ వెల్లడించారు.
సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలకు నామినేటడ్ పదవులు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయనకు ప్లానింగ్ బోర్డ్ వైస్‌ప్రెసిడెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో మల్లాది విష్ణు రెండేండ్ల పాటు కొనసాగుతారు. ఈ పదవిలో నియమితులైన మల్లాది విష్ణుకు క్యాబినెట్ హోదా ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.