Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జ్యేష్ఠాభిషేకం వేడుకలు వేడుకలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు ముత్యపు కవచం ధరించి నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. అంతకుముందు ఉదయం 6.30 గంటలకు మలయప్పస్వామివారు ఉభయనాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు.
అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మలయప్ప స్వామివారికి, దేవేరులకు అభిదేయక అభిషేకాన్ని కనులపండువగా చేపట్టారు. సాయంత్రం స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా నిర్వహించారు. అనంతరం సహస్రదీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా, సంవత్సరానికి ఒకసారి మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ అదనపు ఈవో వెంకటయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.