Srisailam | నాగర్కర్నూల్ : ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు దేవస్థానం ఈవో డీ పెద్దరాజు, అర్చకులు, వేదపండితులు యాగశాలలో ఉత్సవాల ప్రారంభ పూజలు నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రాత్రివేళల్లో స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు జరుగుతాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.
ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేసినట్టు పేర్కొన్నారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు రుద్ర, చండీహోమం, కళ్యాణం, ఏకాంతసేవ నిలుపుదల చేస్తున్నట్టు ఈవో పెద్దిరాజు తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత ఆ స్థాయిలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తారని ఈవో చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. దీంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి సారించారు. డిసెంబర్ 13 నుంచి జనవరి 9 వరకు రూ.4,38,53,238 కోట్ల మేరకు ఆలయ హుండీ ఆదాయం సమకూరిందని తెలిపారు. నగదుతోపాటు 133.3 గ్రాముల బంగారం, 11 కిలోల 850 గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్టు పేర్కొన్నారు.