తిరుమల : తిరుమల(Tirumala)లో ఇటీవల ఘాట్‌రోడ్లపై జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు టీటీడీ బుధవారం శాంతి హోమం నిర్వహించింది. ప్రమాదాల నివారణకు శ్రీవారి ఆశీస్సులు కోరుతూ వైఖానస ఆగమంలో పేర్కొన్న విధంగా డౌన్‌ఘాట్(Ghat road) రోడ్డులోని ఏడో మైలు ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద మహా శాంతి హోమాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వివరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడినట్లు తెలిపారు.
ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను(Road Accidents) ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. భక్తుల భద్రత కోసం వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారుల సూచన మేరకు హోమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.
ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రంలో మహాశాంతి హోమం నిర్వహించడం గురించి పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమంతో ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసిందన్నారు.