తిరుపతి : తిరుపతిలోని కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) భాగంగా మహాశివరాత్రి (Maha Shivaratri) పర్వదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం 6 గంటలకే సర్వదర్శనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో కపిలేశ్వరస్వామివారిని, కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.
వేడుకగా భోగితేరు ఊరేగింపు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం భోగితేరు ఊరేగింపు వేడుకగా జరిగింది. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.
27న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన గురువారం శివపార్వతుల కల్యాణమహోత్సవం జరుగనుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహణ జరుగుతుందని అర్చకులు వివరించారు.