Perni Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సహా 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పేరుతో అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేశ్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాశ్‌తో పాటు దాదాపు 400 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
తమపై కేసు నమోదు చేయడంపై పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 360 రోజులు సెక్షన్ 30 పెట్టడం ధర్మమేనా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నామని.. నెల కాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నడపలేదని 2014-19 మధ్యలోనే చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసిందని గుర్తుచేశారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైద్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచన చేశారని అన్నారు. పేద పిల్లలు మెరుగైన వైద్య విద్య అభ్యసించాలని, 17 కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారని అన్నారు. ఇందులో భాగంగా ఐదు మెడికల్ కాలేజీలను పూర్తి కూడా చేశారని తెలిపారు.కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నాయని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. నిరసనకు పర్మిషన్ అడిగామని.. కానీ అధికారులు ఇవ్వమని చెప్పారన్నారు. మెడికల్ కాలేజీ వద్దకు వెళ్లే లోపలేస్తామని చెప్పారని అన్నారు. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని స్పష్టం చేశారు. అందుకే చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 400 మందిపై కేసులు పెట్టారని పేర్ని నాని తెలిపారు. పదేండ్లు శిక్ష పడే సెక్షన్లు పెట్టారని అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్నామని.. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్రకు నచ్చింది చేసుకోనివ్వండి.. హత్యలు చేసి దొరికినవాళ్లే నామోషిగా ఫీలవ్వడం లేదని.. ఇలాంటి కేసులకు మేమెందుకు బాధపడాలని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడం.. నెలకాకపోతే రెండు నెలలు జైల్లో పెట్టండని వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ మాపై కేసులు పెట్టడాన్ని మేం తప్పు పట్టడం లేదని అన్నారు. ఎస్పీ చర్యలను స్వాగతిస్తున్నామని.. కృష్ణా జిల్లాలో జనసేన, టీడీపీ నేతల అరాచకాలపై కూడా ఇలాగే కొరడా ఝుళిపించాలని డిమాండ్ చేశారు.