Macherla | మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉద్యోగినిని రేప్ చేసిన వ్యక్తి ఆమె ప్రియుడే అని.. వాళ్లిద్దరికీ స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైందని పోలీసుల విచారణలో వెల్లడైంది.
పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మహిళ ఈ నెల 2వ తేదీన తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడిని రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్‌గా గుర్తించారు. బాధిత మహిళకు అతను స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైందని గుర్తించారు.
కాగా బాధిత మహిళ మాచర్ల ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్‌గా పనిచేస్తున్నది. ఆమెకు గతంలో ఇద్దరితో వివాహం కాగా, విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే స్నాప్‌చాట్‌లో పరిచయమైన శ్రీనివాస్‌తో చాటింగ్ చేసేది. ఈ నెల 2వ తేదీన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పంపించి, ఇంటికి రమ్మని పిలిచింది. ఇంటికి వెళ్లిన శ్రీనివాస్.. మహిళను బలవంతం చేయబోయాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో నిందితుడు విచక్షణ మరిచి ప్రవర్తించగా.. మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో మహిళను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు కట్టేసి అత్యచారం చేసి పారిపోయాడు.
పరిచయస్తుడే అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు నిజం చెప్పకుండా.. గుర్తు తెలియని వ్యక్తి నీరు తాగడానికి వచ్చి తనపై దాడికి పాల్పడి, అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ చాటింగ్ ద్వారా వివరాలను సేకరించారు. ఈ నెల 8వ తేదీన మాచర్ల రైల్వే స్టేషన్ వద్ద నామాల శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. గురువారం నిందితుడిని మాచర్ల కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.