తిరుమలలో నిఘా నిద్రపోతున్నది. నిఘా అధికారుల వైఫల్యం బట్టబయలైంది. తిరుమల కొండపైన మద్యం బాటిళ్లు పట్టుబడి కలకలం రేపింది. తిరుమల సప్తగిరి గెస్ట్‌హౌస్ వద్ద శ్రీరాములు అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. అతడి వద్ద 13 మద్యం సీసాలు బయటపడ్డాయని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి.. నిందితుడిని తిరుమల రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. తిరుమలకు నిషేధిత వస్తువులు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిజానికి తిరుమల కొండపైకి నిషేధిత వస్తువులను అధికారులు అనుమతించరు. అలిపిరి చెక్‌పోస్ట్ వద్దే విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి ఎవరి వద్దనైనా లభిస్తే స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది 13 మద్యం బాటిళ్లు కొండపైన పట్టుబడటంతో భక్తులు నిఘా వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి 13 బాటిళ్లను కొండపైకి ఎలా చేర్చాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా మద్యం బాటిళ్లు, మాంసం, గుట్కా తరలిస్తూ పలువురు దొరికిపోయారు. అయితే, ఇప్పుడు అలిపిరి చెక్‌పోస్ట్ దాటుకుని కొండపైకి చేరడం సంచలనం రేపుతున్నది. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు నిఘా అమలు చేయడంలో విఫలమవడం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యమత ప్రచారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు.