అమరావతి: రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయవ్య గాలులు వీస్తున్న తరుణంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఇవాళ, రేపు ఏపీతోపాటు యానాంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అలాగే ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇటీవలి వర్షాలకు ఏపీలో అపార నష్టం సంభవించింది. వేల ఎకరాల్లో పంట నష్టపోగా.. చాలా మంది నిరాశ్రుయులయ్యారు. 240 కి పైగా గ్రామాల్లో వరదలు చుట్టుముట్టాయి. ఇప్పుడు మళ్లీ మబ్బులు కమ్ముకుంటుండటంతో అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. మొన్నటి స్థాయిలో వర్షాలు కరిసే అవకాశం లేదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.