తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో చిరుతల సంచారం (Leapord Attack) కలకలం సృష్టిస్తున్నది. గత కొంతకాలంగా భక్తులు, వాహన దారులపై చిరుత పులులు దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా అలిపిరి ఎస్వీ జూపార్క్ రోడ్డులో ఓ బైక్పై చిరుతపులి దాడికి యత్నించింది. శుక్రవారం రాత్రి ఓ బైక్పై ఇద్దరు యువకులు ఎస్వీ జూపార్క్ మీదుగా వెళ్తున్నారు.
ఈ క్రమంలో పొదల్లో పొంచి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా బైక్పై దూకింది. అయితే మోటారు సైకిల్ స్పీడ్లో ఉండటంతో అది పక్కకు పడిపోయింది. దీంతో వారు పులి పంజా నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇదంతా అదే సమయంలో కారులో వెళ్తున్న వారు తమ సెల్ఫోన్లో బంధించారు. కాగా, వరుస ఘటనలతో తిరుపతివాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.