నెల్లూరు: రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల 20 వ తేదీన శంకుస్థాపన చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ పనులను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాలను శనివారం ఉదయం నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు మీడియాకు తెలిపారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జగన్ పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రామాయపట్నం పోర్ట్‌కు శంకుస్థాపన తర్వాత.. ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని కలెక్టర్ చెప్పారు.
రామాయపట్నం ఓడరేవు నిర్మాణంపై దశాబ్దాలుగా ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేజర్ పోర్టు ఏపీకి రావాలి. అయితే, రాజకీయ నేతల్లో సరైన సంకల్పం లేకపోవడం వల్ల ఈ ప్రదపాదన అటకెక్కింది. అయితే, 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం జరిగిపోవడంతో ఓడరేవు నిర్మాణం పనులు నిలిచిపోయాయి. అయితే, రామాయపట్నం ఓడరేవును దశలవారీగా అభివృద్ధి చేసేందుకు రెండేండ్ల క్రితం ఏపీ మంత్రిమండలి ఆమోదించి.. ఆ మేరకు బడ్జెట్లో దాదాపు రూ.3 వేల కోట్లు కేటాయించారు. రెండు సంస్థలు సంయుక్తంగా రూ.2,650 కోట్లకు దక్కించుకున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి, మార్చిలో శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరిగినా.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎట్టకేలకు ఈ నెల 20 న శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన ఖరారైంది.
బహిరంగ సభ వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించాలని, ప్రొటోకాల్ పాటించాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎం పర్యటన నిమిత్తం అధికారులకు విధులు కేటాయించామని, కావలి, కందుకూరు ప్రాంతాల్లో వీఐపీ, వీవీఐపీలకు బస ఏర్పాటు చేయాలని, ప్రామాణిక విధానాలు పాటించాలని కలెక్టర్ కోరారు. బహిరంగ సభా స్థలిలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు సమాచార సాంకేతిక శాఖ చర్యలు తీసుకోవాలని, రానున్న రామాయపట్నం ఓడరేవు ద్వారా స్థానికులకు ఆదాయం, ఉపాధి కల్పించేందుకు మరిన్ని పరిశ్రమలు ఏర్పడతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.