అమరావతి : నెల్లూరు కోర్టులో మంత్రి కాకాణి ముద్దాయిగా ఉన్న కేసు పత్రాల చోరీపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ నెల్లూరు కోర్టు భవనాల సముదాయం వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవ్యవస్థను కాపాడాలని నినాదాలు చేశారు. దొంగల బారి నుంచి న్యాయస్థానాన్ని రక్షించాలని, దోషులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారని, అనామక దొంగలను అరెస్టు చేయడం కాదని న్యాయవాదులు పేర్కొన్నారు.
చోరీకి పాల్పడిన అసలు దొంగలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాకాణి మొదటి ముద్దాయిగా ఉన్న కేసు ప్రాపర్టీ చోరీకి గురైందని , వందల కేసులు ఉండగా ఈ ఒక్క కేసు పత్రాలే ఎందుకు దొంగిలించారని ప్రశ్నించారు. చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారత దేశ చరిత్రలోనే ఇలాంటి చోరీ జరగలేదని వారు ఆరోపించారు. కేసు పత్రాలు దొంగిలించడం దుర్మార్గమైన చర్యని, కోర్టులోనే చోరీ జరిగితే ప్రజలు ఎవరి వద్దకు వెళ్లాలని ఆందోళన వ్యక్తం చేశారు.