అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం కొత్త యాప్‌ను ప్రారంభించింది. నంబర్14400 అనే నంబర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాడెపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు యాప్ డౌన్లోడ్ చేసి బటన్ నొక్కి వీడియో లేదా ఆడియో సంభాషణ రికార్డు చేయాలన్నారు. ఫిర్యాదులను ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందని వివరించారు.
ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధక చట్టంలో బాధ్యత ఉందని అన్నారు. స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి బాధితుల వద్దకు వెళ్లి నేరుగా కలిసి వారి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి లేకుండా లక్షా 41వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు.