అమరావతి: ఏపీలోని ఆరు జిల్లాల్లో భూ రీసర్వే చేపట్టేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు 2,225 ప్రత్యేక బృందాలను నియమించింది. ఈ ప్రత్యేక బృందాలకు జగనన్న భూ రక్ష సర్వే ఫోర్సెస్‌గా నామకరణం చేశారు. ఈ బృందాలు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భూ రీసర్వే చేపట్టనున్నాయి. ఈ జిల్లాల్లో సర్వేకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం కావడంతో ఈ బృందాలను నియమించిన ప్రభుత్వం.. పక్క జిల్లాల ఉద్యోగులను సైతం డిప్యూటేషన్‌పై నియమించడం విశేషం. ఒక్కో బృందంలో ఇద్దరు గ్రామ సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏ నిత్యం 20 నుంచి 30 ఎకరాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది.
రోజుకు 50 వేల ఎకరాలు సర్వే చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు ఏ జిల్లా ఉద్యోగులతో ఆ జిల్లాలో సర్వే చేయించారు. సర్వే నిర్వహించిన గ్రామంలో 20 నుంచి 30 మంది సర్వేయర్లు, ఒక వీఆర్వో, ఒక వీఆర్ఏతో కూడిన బృందాన్ని వినియోగించారు. గ్రామంలో క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసిన తర్వాత ఈ బృందాలను మరో గ్రామానికి పంపిస్తారు. పక్క మండలాల్లోని సర్వేయర్లను కూడా వినియోగిస్తున్నారు. ఈ బృందాలు కొన్ని నెలలుగా అవిశ్రాంతంగా రీసర్వేలో నిమగ్నమై ఉండనున్నాయి.
రీసర్వేలో కీలకమైన 11,118 మంది గ్రామ సర్వేయర్లను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం నియమించింది. ఇలాంటి పనులకు ఉపయోగించుకోవాలన్న దూరదృష్టితో ప్రభుత్వం గ్రామానికో సర్వేయర్‌ను నియమించినట్లుగా చెప్తున్నారు. అసలింతకీ ఈ రీసర్వే చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రీసర్వే చేయడానికి గల కారణాలు చెప్పిన తర్వాతనే సర్వే బృందాలు గ్రామాల్లోకి రావాలని వారు పంతంతో ఉన్నారు. అయితే, రీసర్వే ఎప్పటి నుంచి ప్రారంభించేది ఎప్పటి నుంచి అనేది త్వరలో వెల్లడికానున్నది.