తిరుపతి : తిరుచానూరు( Tiruchanur ) శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం లక్ష కుంకుమార్చన ( Laksha Kumkumarchana ) సేవను వైభవంగా నిర్వహించారు. హిందూ సనాతన ధర్మంలో కుంకుమకు ఎనలేని ప్రాధాన్యత ఉందని, వివాహితురాలైన మహిళ నుదుట కుంకుమ ధరించడం వల్ల భర్త దీర్ఘాయుష్షు పొందుతాడని హిందూ ధర్మం చెబుతోందని అర్చకులు వెల్లడించారు.

అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయమన్నారు. ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ సేవలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, పాంచరాత్ర ఆగమసలహాదారు మణికంఠ భట్టర్, అర్చకులు బాబుస్వామి, అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.