తిరుపతి : తిరుచానూరు ( Tiruchanur) పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను (Brahmotsavam) పురస్కరించుకుని బుధవారం లక్ష కుంకుమార్చన (Laksha kumkumarchana) సేవ వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు లాంటి భారీ ఉత్సవాలను నిర్వహించే ముందు అర్చకులు లక్ష కుంకుమార్చన నిర్వహించడం సంప్రదాయం.
ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో పద్మావతి అమ్మవారిని ఆశీనులను చేసి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన సేవ నిర్వహించారు. అర్చకులు లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలను వల్లిస్తూ అమ్మవారిని కుంకుమతో అర్చన చేశారు.
పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
రేపటి నుంచి డిసెంబరు 6వతేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో (TTD EO) జె. శ్యామల రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, అమ్మవారి ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు.
బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు, పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం 20 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు, భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, సైన్ బోర్డులు, రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు.