Srikalahasti | శ్రీకాళహస్తిలో మహిళా అఘోరీ వివాదం సద్దుమణిగింది. దిగంబరంగా ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించి హల్చల్ చేసిన ఆమె.. ఎట్టకేలకు వస్త్రాలు ధరించి శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకునేందుకు అంగీకరించారు. దీంతో పోలీసుల బందోబస్తు నడుమ దర్శనం ముగించుకుని క్షేత్రాన్ని విడిచి వెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వస్తున్న మహిళా అఘోరీ (నాగ సాధువు) గురువారం నాడు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తికి వచ్చారు. దిగంబరంగా ఆలయంలోని శివయ్య గోపురం గుండా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో ఆమెను మహానందీశ్వరుడి ప్రతిమ సమీపంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం దుస్తులు లేకుండా ఆలయంలోకి అనుమతించేది లేదని సిబ్బంది సూచించారు. దీంతో భద్రతా సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు.
తనను ఎలాగైనా దర్శనానికి పంపాల్సిందేనని పోలీసులతో గొడవకు దిగారు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మార్పణ చేసుకునేందుకు కూడా యత్నించారు. దీంతో పట్టణ పోలీసులు, ఆలయ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బలవంతంగా ఆమెకు వస్త్రాలు చుట్టి.. ఆలయ అంబులెన్స్‌లో మహిళా భద్రతా సిబ్బందితో బందోబస్తుగా తమిళనాడు పరిధిలోని ఆరంబాకంలో వదిలిపెట్టారు. అయితే గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ మహిళా అఘోరి శ్రీకాళహస్తికి వచ్చారు. సంప్రదాయ దుస్తులను ధరించి వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు నచ్చజెప్పారు. ఎట్టకేలకు ఎర్రని వస్త్రంతో శరీరాన్ని కప్పుకుని.. కపాల మాలలు తీసి వేసి ఆలయంలోకి వెళ్లేందుకు సుముఖత చూపించారు. దీంతో పోలీసు బందోబస్తు నడుమ అఘోరీ శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు.