లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా ఓ గర్భిణీ బలైంది. స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తెలియడంతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలులో జరిగిన ఈఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బీరవోలుకు చెందిన ఓ మహిళకు స్థానిక రక్ష హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అబార్షన్ కోసం నందికొట్కూర్‌లోని ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను సంప్రదించారు. అయితే అబార్షన్ వికటించడంతో తీవ్ర రక్తస్రావమైన గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన రక్ష హాస్పిటల్ నిర్వాహకులు పరారయ్యారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.