తిరుపతి : తిరుపతిలోని వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ధ్యానారామంలోని బృహదీశ్వర స్వామి ఆలయ కలశస్థాపన, కుంభాభిషేకం(Kumbhabhishekam) శుక్రవారం వైభవంగా జరిగింది. శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది.కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా దైవానుజ్ఞ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన నిర్వహించారు.
ఆ తర్వాత రుత్విక్ వరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వాస్తు హోమం, పర్యజ్ఞీకరణ, శిఖరానికి క్షీరాధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, నవరత్న, ధాతున్యాసాలు చేపట్టారు. శిఖరస్థాపనలో భాగంగా మూర్తిహోమం, మూలమంత్ర హోమాలు, కళాహోమాలు, శాంతి హోమాలు నిర్వహించారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేకం సంప్రోక్షణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణీ సదాశివమూర్తి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, సీఏఓ శేష శైలేంద్ర, వేద వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధాగోవింద త్రిపాఠి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.