Kota Srinivasa Rao | విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు సామినేని ఉదయభాను ఆసక్తికర విషయాలను తెలియజేశారు. కోట హీరోగా సినిమాల్లోకి రావాలని అనుకున్నారని.. కానీ అప్పటికే ఆయన 40 ఏళ్లకు దగ్గరకు రావడంతో హీరో అవ్వడం కుదరలేదని చెప్పారు. అందుకే ప్రాణం ఖరీదు సినిమాలో చిన్న పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారని అన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఏర్పాటు చేసిన కోట శ్రీనివాసరావు సంతాప సభలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు.
కోట శ్రీనివాసరావు 1978లో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. సుమారు 40 ఏళ్ల కెరీర్లో చలన చిత్ర రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా ఎదిగారని సామినేని ఉదయభాను కొనియాడారు. కోట శ్రీనివాసరావు హీరోగా రావాలని అనుకున్నారని.. కానీ అప్పటికే 40 ఏళ్లకు వచ్చేశారని చెప్పారు. కాబట్టే 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో చిన్న పాత్రలో వెండితెర మీద కనిపించారని అన్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ ఐదు భాషల్లో దాదాపు 750 సినిమాల్లో నటించారని అన్నారు. కోట జీవితంలో మరిచిపోలేని సంఘటన ఏదైనా జరిగిందంటే.. అది ఆయన కుమారుడిని కోల్పోవడమే అని అన్నారు. పలుమార్లు ఆయన చాలామందితో చర్చించిన విషయం ఏమైనా ఉందంటే.. అది తన కుమారుడి అకాల మరణం గురించేనని తెలిపారు.
ఇక ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. బీజేపీ సిద్ధాంతాలను చాటిచెప్పి.. పాటించిన వ్యక్తి కోట అని అన్నారు. తెలుగువారిని, తెలుగు సినిమాను కాపాడటానికి ఆయన ఎప్పుడూ ముందు ఉండేవారని అన్నారు. తాను నమ్ముకున్న కలమా తల్లిని, చలన చిత్ర రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి అని అన్నారు. కోట ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.