అమరావతి: కోనసీమ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించాలని వారు నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలు రైతు సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈ మేరకు కోనసీమ రైతుల పరిరక్షణ సమితి వెల్లడించింది. కోనసీమ జిల్లా పరిధిలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించనున్నట్లు ప్రకటించారు. కోనసీమలో 201 1లో రైతులు క్రాప్ హాలిడే ను ప్రకటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తిరిగి క్రాప్ హాలిడేను ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతు సమస్యలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతోపాటు ప్రభుత్వం సహకరించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పంటలు వేయడానికి కూడా తమ వద్ద కావాల్సినంత డబ్బు లేదని, అప్పులు చేయాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలు మొదలుకుని అన్నీ వస్తువుల ధరలు పెరగిపోయాయని, అయితే మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. సేకరించిన ధాన్యానికి కూడా ప్రభుత్వం సకాలంలో డబ్బు చెల్లించడం లేదన్నారు. అయితే టీడీపీ ట్రాప్ లో పడొద్దని మంత్రి విశ్వరూప్ సూచించారు. కొందరు రైతు సంఘాల నేతల ముసుగులో పార్టీ నేతలుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లా ఆచంటలో 73 ఏళ్ల నెక్కొండ సుబ్బారావు దాదాపు 55 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. వరిపై తగినంత రాబడి రాకపోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది రైతులతో కలిసి తాను కూడా విరామం ప్రకటించాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు.