కోనసీమ జిల్లా: కలెక్టర్ పలు ఆలయాల్లో ఆకస్మికంగా సందర్శించి అక్కడ రాజ్యమేలుతున్న అపరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి పురాతన ఆలయాలను ఇలాగేనా సంరక్షించుకోవడం అని అక్కడే ఉన్న ఈఓను నిలదీశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పురాతన ద్రాక్షారామం ఆలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో అపరిశుభ్రతను గమనించి ఆశ్చర్యపోయారు.
కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలోని పురాతన పంచారామ క్షేత్రమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లు పరిశీలించారు. ఆలయం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ఆలయ సీలింగ్‌పై సాలెపురుగులు ఉండడం చూసి అవాక్కయ్యారు. జీతాలు తీసుకుంటూ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. ఆలయంలో పరిశుభ్రత పాటించకపోవడంపై ద్రాక్షారామం ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్‌వీడీ ప్రసాద్, ఇతర సిబ్బందిపైన ఆయన మండిపడ్డారు. ఆలయ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్.. ఆలయంలో ఇదే పరిస్థితులు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ శుక్లా సమక్షంలోనే ఆలయంలో ఫ్యాన్‌ను ఈఓ ప్రసాద్ శుభ్రం చేశారు.
ఈ ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా ఉన్నదని, శివుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తారని కలెక్టర్ హిమాన్షు చెప్పారు. అందుకే ఆలయం పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీస్సులు పొందారు.