అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం కోన రఘుపతి కొద్ది సమయం పాటు సభను నిర్వహించారు. అనంతరం తన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాంకు అందజేశారు. మూడేండ్ల పాటు డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన కోన రఘుపతి.. ఉన్నపళంగా ఈ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ క్యాడర్ చర్చించుకుంటున్నది.
కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తుత సమావేశాల్లోనే జరుగనున్నట్లుగా వైసీపీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. కోన రఘుపతి స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి మంత్రివర్గంలో ఒక్కరు కూడా లేరు. దాంతో క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవిని ఆర్యవైశ్యులకు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.