అమరావతి : ఏపీలో సహజసిద్ధంగా ఉన్న కొల్లేరు సరస్సు చేపల చెరువులతో ఆక్రమణకు గురైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Secretary Narayana ) ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సు (Kolleru Lake) నేడు ఆక్రమణలతో కుంచించుకుపోయిందని ఆరోపించారు. చేపల చెరువుల పేరుతో వందలాది ఎకరాలు కబ్జాకు గురైందని, ప్రస్తుతం 25 ఎకరాల్లో మాత్రమే కొల్లేరు సరస్సు ఉందని పేర్కొన్నారు. చేపల చెరువులను ప్రభుత్వం తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.
2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను తూ.చ తప్పకుండా అమలు చేయాలని, కొల్లేరు సరస్సును అంతర్జాతీయ సందర్శన కేంద్రంగా మార్చాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల పక్షులు సరస్సుకు వస్తాయని అటువంటి సరస్సును ఫిష్ మాఫీయా(Fish Mafia) ప్రభుత్వంలో చేరి ఆక్రమించుకుందని విమర్శించారు.
కొల్లేరు సరస్సు ఎప్పుడూ కూడా సహజ సిద్ధంగా ఉండాలని, పెస్టిసైడ్స్ వాడవద్దని , ఎలాంటి మందులు వాడవద్దని నిబంధనలు ఉండగా వాటిని మాఫియా తుంగలో తొక్కి ఇష్టారీతిన చేపల చెరువులను ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన కంటెప్ట్కోర్టు నోటీసుకు అనుగుణంగా ఆక్రమించుకున్న చేపల చెరువులను అక్కడి నుంచి తొలగించాలని నారాయణ డిమాండ్ చేశారు.