తిరుపతి : తిరుచానూరు పద్మావతీ (Padmavati ) అమ్మవారి వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ( Koil Alwar Thirumanjanam ) మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుంచి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.

ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
పరదాలు బహుకరణ..

హైదరాబాద్కు చెందిన స్వర్ణకుమార్ రెడ్డి ప్రతినిధులు అమ్మవారి ఆలయంలో మంగళవారం 7 పరదాలను, తిరుపతికి చెందిన మణి 3 పరదాలను డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, అర్చకులు బాబు స్వామికి దాతలు అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు.
వాహన సేవలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలలో విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారని అర్చకులు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.