తిరుపతి : తిరుపతిలోని అప్పలాయగుంట(Appalayagunta) శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని(Koil Alwar Thirumanjanam)మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు.
ఉదయం 8 నుండి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Annual Brahmotsavams) జరుగనుండడంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు వివరించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే వాహన సేవల వివరాలను వెల్లడించారు. 31న ధ్వజారోహణం-పెద్దశేష వాహనం, జూన్ 1న చిన్నశేష వాహనం, హంస వాహనంపై స్వామివారు ఊరేగుతారని చెప్పారు. 2న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం,3న కల్పవృక్ష వాహనంపై కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనంపై విహరిస్తారని వెల్లడించారు.
4వ తేదీన మోహినీ అవతారంలో గరుడ వాహనంపై దర్శనమిస్తారని వివరించారు. 5వ తేదీన హనుమంత వాహనం,గజ వాహనం, 6న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 7న రథోత్సవం, అశ్వవాహనంపై ఊరేగుతారని పేర్కొన్నారు. 8న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తామని తెలిపారు.