తిరుపతి : అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Thirumanjanam) ఘనంగా జరిగింది. ఆలయంలో ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాల (Annual Brahmotsavam) ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఆలయంలో జూన్ 16న సాయంత్రం శాస్త్రోక్తంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుందని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, సాయంత్రం నిర్వహించే వాహన సేవల వివరాలను ప్రకటించారు.