తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు.
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం తో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవరం, ఊంజల్‌సేవను రద్దు చేశారు.
8 పరదాలు విరాళం
హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు ఆలయానికి 8 పరదాలు విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈవో ప్రభాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.