తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. ఈ సందర్బంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని తెలిపారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న పౌర్ణమి గరుడసేవ (Garuda Seva) వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని టీటీడీ అధికారులు వివరించారు.