తిరుపతి : తిరుపతి( Tirupati ) శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ( Brahmotsavams) వైభవంగా ప్రారంభమయ్యాయి. కంకణ బట్టర్ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam ) ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.