అమరావతి : ఏపీ మంత్రివర్గ(AP Cabinet) సమావేశం కీలక తీర్మానాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra babu) అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానం (New Excise Policy) అమలులోకి తీసుకురానున్నామని మంత్రి పొలుసు పార్థసారథి (Minister Parthasarathi) మీడియా సమావేశంలో వెల్లడించారు. అల్పదాయ వర్గాలకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ధరలకు అందించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. 2019-24 కాలంలో వైఎస్ జగన్ అమలు చేసిన మద్యం పాలసీ వల్ల ఏపీకి 18,860 కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు.
జగన్ ఫోటో బదులు రాజముద్ర, క్యూఆర్తో కూడిన పట్టా పుస్తకం
పట్టాపుస్తకంపై జగన్ ఫోటో బదులు రాజముద్ర, క్యూఆర్తో కూడిన పట్టా పుస్తకం అందజేయాలని సమావేశం తీర్మానించింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు రానున్న మూడు నెలల పాటు రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీ కేటాయించిన 280 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని శ్రీశైలం ఆలయ విస్తరణకు కేటాయించేందుకు నిర్ణయించిందని మంత్రి వివరించారు.
ఎన్నికల్లో పోటీకి ఇద్దరికి మించి పిల్లలు ఉండరాదన్న చట్టం రద్దు
మున్సిపల్, పంచాయతీ పరిధిలో ఇద్దరికి మించి ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎన్నికల్లో పోటీ చేయడం , సభ్యులుగా కొనసాగించరాదని తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దుకు మంత్రి మండలి సమావేశం ఆమోదం తెలిపింది. ఫిష్మెన్ కోఆపరేటివ్ సొసైటీలకు ఇంతకు ముందు ఇచ్చిన జీవోలను రద్దు చేసి, మత్స్య సంపదను పెంచడానికి, మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
మెడికల్ కళాశాలలో (Medical College) ఫేజ్ -1 కింద విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం , నంద్యాలలో మెడికల్ కళాశాలకు మంజూరైన సీట్లు పెంచాలని , పోస్టులకు అదనంగా మరో 380 పోస్టుల భర్తీ చేయాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. ఫేజ్ -2 కింద పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి నూతన కళాశాలలో వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తో ప్రారంభించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం విధించేలా కేబినెట్ తీర్మానించిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.