Srisailam | ఈ నెల 24న శ్రీశైలం దేవస్థానంలో కౌండిన్య గౌడసత్రం తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయం కల్పించేందుకు దేవస్థానం పరిధిలో ఆయా సామాజిక వర్గాలకు దేవస్థానం భూమిని కేటాయించింది. ఇందులో కౌండిన్య గౌడసత్రం సైతం ఒకటి. సదరు సత్రం నిర్వహణలో కార్యవర్గం మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొత్తగా తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సదరు సత్రం నిర్వాహకులు దేవస్థానం అధికారులను కోరారు.
అందుకు అనుగుణంగా దేవస్థానం సిబ్బంది సమక్షంలో కౌండిన్యగౌడ సత్రం నూతన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నెల 24న ముహూర్తం నిర్ణయించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఈ చంద్రశేఖరరెడ్డి, కార్యనిర్వాహక ఇంజినీర్ పీ మురళీబాలకృష్ణ, పర్యవేక్షకులు ఎం శ్రీనివాసరావు, ఎం మల్లికార్జున, ఈ మల్లిక్ రాజా, సీనియర్ అసిస్టెంట్ కే శ్రీనివాసులును సభ్యులనుగా నియమించారు. వీరి ఆధ్వర్యంలో కార్యవర్గం ఎంపిక జరుగనున్నది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు కౌండిన్య సత్రంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని.. వివాదరహితంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని కౌండిన్య గౌడ కులపెద్దలు, డోనర్లకు దేవస్థానం సూచించింది.