నంద్యాల జిల్లా : వైసీపీలో అంతర్గత విబేధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్న గుంటూరులో మాజీ మంత్రి ఇంటి వద్ద ఎమ్మెల్యే దీక్షకు దిగగా.. సీఎం సొంత జిల్లాలో మరో సీనియర్ నాయకుడు జగన్‌కు షాకిచ్చారు. బనగానపల్లికి చెందిన సీనియర్ వైసీపీ నేత కాటసాని రమాకాంత్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఫేస్బుక్ వేదికగా ఒక వాక్యం రాసిన కాటసాని.. అటు పార్టీ కార్యకర్తలకు, ఇటు అధిష్టానాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
‘గుడై బై వైఎస్సార్సీపీ..!!! సారీ సీఎం వైఎస్ జగన్’ అంటూ ఏక వాక్యంతో ఫేస్బుక్ పేజీలో తన రాజీనామా నిర్ణయాన్ని కాటసాని రమాకాంత్‌రెడ్డి ప్రకటించారు. తానెందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నదీ వెల్లడించలేదు. కాటసాని కుటుంబానికి చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పడంతో నంద్యాల, బనగానపల్లి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
రమాకాంత్‌రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోదరుడి కుమారుడు. ప్రస్తుతం అవుకు మండలం పరిధిలోని గుండ్ల సింగవరం గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఇప్పటివరకు కాటసాని కుటుంబం మొత్తం వైసీపీలో ఉన్నది. ఈ నేపథ్యంలో రమాకాంత్‌రెడ్డి పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది.