తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని (Kartika Parva Deepotsavam ) టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తామని టీటీడీ (TTD) అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సాయంత్రం నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తామన్నారు. ఈ కారణంగా 15వ తేదీన సహస్రదీపాలంకరణ సేవను, పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది.
16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు
తిరుపతి : పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 232 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం జరుగుతుందని అధికారులు వివరించారు.