చిత్తూరు జిల్లా : కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఇవాళ ఆదివారం చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. ముందుగా చిన్న శేష వాహనానికి వెయ్యి ఒక్క కలశాలతో పుణ్యాహ వచనం మొదలైన ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగోరోజుకు చేరాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 1,116 మంది దంపతులు తలపై కలశాలు పెట్టుకుని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి తేనె, నెయ్యి, పాలు, పెరుగు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. షోడశోర పూజలు అనంతరం చిన్నశేష వాహనంపై కాణిపాక మాడవీధుల్లో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామిని ఊరేగి భక్తులను ఆశీర్వదించారు. సుందరంగా తీర్చిదిద్దిన శేష వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరసిద్ది వినాయకుడు ఆశీనుడయ్యారు. అనంతరం వాహన సేవను ఆలయ ఛైర్మన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు.