Madhavi Reddy | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తనకు కుర్చీ ఇవ్వలేదని హంగామా చేసిన ఉదంతంపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి తాజాగా స్పందించారు. కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో స్టేజిపై తనకు కుర్చీ వేయలేదని మాధవిరెడ్డి అలిగి.. అరగంటసేపు నిల్చొని వెళ్లిపోయారనే వార్త నిన్న వైరల్‌గా మారింది. తనకు సరైన మర్యాదలు చేయలేదని జేసీ అతిథి సింగ్‌పై కోప్పడ్డ వీడియో కూడా సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే దీనిపై మాధవి రెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.
కడప కలెక్టరేట్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవానికి అధికారులు తనను ఆహ్వానించారని మాధవి రెడ్డి తెలిపారు. అధికారుల ఆహ్వానం మేరకే తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లానని పేర్కొన్నారు. ఈ వేడుకలకు నాతో పాటు జిల్లాలోని పెద్దలు, విద్యాసంస్థల అధినేతలు, కుల, మత పెద్దలను ఆహ్వానించారని.. ఆ జాబితాకు సంబంధించిన వారికి కలెక్టర్, కలెక్టరేట్ సిబ్బంది ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నిన్న స్వాతంత్య్ర వేడుకలకు వెళ్లే.. అక్కడ అతిథులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన స్థలంలో కూర్చునే అవకాశం లేదని చెప్పారు. మొత్తం కలెక్టరేట్ సిబ్బంది, పోలీసు అధికారులు, వాళ్ల సిబ్బందే ఆ కుర్చీల్లో కూర్చున్నారని వివరించారు. వారిని లేపించి తాను కూర్చోవడం పద్ధతి కాదని అనిపించిందని.. అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్లిపోయానని స్పష్టం చేశారు.
ఇంత పెద్ద వేడుకకు అతిథులను పిలిచి.. వారు కూర్చోవడానికి వీలులేని విధంగా అరెంజ్మెంట్స్ చేసినందుకు కలెక్టర్‌కు కృతజ్ఞతలు అని వ్యంగ్యంగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అధికారుల కుటుంబసభ్యులు చేసుకునే కార్యక్రమంగా, వాళ్ల పండుగగానే భావించి అక్కడి నుంచి వెనుదిరిగానని వెటకారంగా చెప్పారు. దీన్ని చాలా గొప్పగా ఆలోచించి, సోషల్‌మీడియాలో అంత సమయం కేటాయించి పెద్ద చర్చ చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అధికారుల ఆహ్వానం మేరకు హాజరయ్యాను. కానీ నాకు కేటాయించిన ప్రదేశంలో వేరే అతిథిలు కూర్చున్నారు. అక్కడ కూర్చున్నవాళ్లు మన అధికారుల కుటుంబ సభ్యులే, వారిని లేపించి నేను కూర్చోవడం పద్ధతి కాదనిపించింది, అందుకే నిల్చుని కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళిపోయాను.… pic.twitter.com/f8H3o7RNIl
— Reddeppagari Madhavi (@R_Madhavi_Reddy) August 16, 2025